
బండ్ల గణేష్ మైక్ పట్టుకొని మాట్లాడాడంటే.. వైరల్ అవ్వడమో, వివాదం అవ్వడమో కామన్ అయిపోయింది. ఇటీవల ‘కె-ర్యాంప్’ సక్సెస్ మీట్‌లో బండ్ల గణేష్ స్పీచ్ వివాదానికి దారి తీసింది. ఈ ఈవెంట్ లో ఆయన విజయ్ దేవరకొండను టార్గెట్ చేసి విమర్శలు చేశాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా బండ్ల గణేష్ ప్రకటన చేశాడు. (బండ్ల గణేష్)
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన రీసెంట్ హిట్ ఫిల్మ్ ‘కె-ర్యాంప్’ సక్సెస్ మీట్ తాజాగా హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి హాజరైన బండ్ల గణేష్.. కిరణ్ పై ప్రశంసలు కురిపిస్తూ, పరోక్షంగా విజయ్ పై విమర్శలు చేసినట్లు అనిపించింది.
“మిడిల్ క్లాస్ కి చెందిన కిరణ్, హీరో కావాలని కలలు కని దానిని నిజం చేసుకున్నాడు. కిరణ్ ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఒక్క సినిమా హిట్ కాగానే ‘వాట్సాప్ వాట్సాప్’ అని మాట్లాడుతుంటారు. ఒక్క సినిమా హిట్ అయితే లూజ్ ప్యాంట్, కొత్త కొత్త చెప్పులు, నెత్తి మీద క్యాప్, కళ్ళకి అద్దాలు పెట్టుకొని ఈ రోజుల్లో కిరణ్ సింపుల్ గా కొత్త సినిమాలు చేస్తున్నాడు. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వకపోతే.. మీరు ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళా?. అని కె-ర్యాంప్ ఈవెంట్ లో బండ్ల గణేష్ మాట్లాడాడు.
సినిమా వేడుకల్లో “వాట్సాప్ వాట్సాప్ మై రౌడీ బాయ్స్” అంటూ విజయ్ తన అభిమానుల్లో జోష్ పెంచుతాడు. దీంతో “వాట్సాప్ వాట్సాప్” అని బండ్ల చేసిన వ్యాఖ్యలు.. విజయ్ ని టార్గెట్ చేసినట్టు ఉన్నాయానే కామెంట్స్ వినిపించాయి. అలాగే, కెరీర్ స్టార్టింగ్ లో కొత్త దర్శకులతో వర్క్ చేసిన విజయ్.. ఇప్పుడు చెయ్యట్లేదు. ఆ తర్వాత కూడా బండ్ల ప్రస్తావించి.. పరోక్షంగా విజయ్ ని విమర్శించాడనే మాటలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
‘కె-ర్యాంప్ సక్సెస్ మీట్ లో తన స్పీచ్ పై తెగ చర్చ జరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా బండ్ల గణేష్ స్పందించారు. “ఇటీవల కె-ర్యాంప్ సినిమా సక్సెస్ మీట్‌లో నేను మాట్లాడిన మాటలు కొందరిని బాధపెట్టాయని తెలిసింది. నేను ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదు. నా ఉద్దేశ్యం అందరూ బాగుండాలి, కళామాత ఆశీస్సులతో అందరం పైకి రావాలని మాత్రమే. ఎవరైనా బాధపడితే క్షమాపణలు.” అని బండ్ల ట్వీట్ చేశాడు. మరి ఈ ట్వీట్ తోనైనా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.
