
కమెడియన్ లు హీరోలుగా మారడం అనేది చూస్తుంటాం. ఆలీ, సునీల్ వంటి కమెడియన్స్ హీరోలుగా హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు మరో కమెడియన్ కూడా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.
ఈ జనరేషన్ కమెడియన్స్ లో తనదైన కామెడీ టైమింగ్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు సత్య. ముఖ్యంగా ‘మత్తు వదలరా’ సినిమాలో అతని కామెడీకి ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ఆ చిత్ర దర్శకుడి సినిమాతోనే సత్య హీరోగా మారుతుండటం విశేషం.
‘మత్తు వదలరా’ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్ ఓ సినిమా నిర్మిస్తోంది. ఇందులో సత్య హీరోగా నటిస్తున్నాడు.
సత్య హీరోగా ఎంట్రీ ఇస్తున్న తెలుపుతూ మొదట అనౌన్స్ మెంట్ వీడియో విడుదల చేశారు. మనీ సినిమాలో బ్రహ్మానందం పాత్రను స్ఫూర్తిగా తీసుకుని ఆ వీడియోలో.. కమెడియన్ గా బాగానే ఉంది లైఫ్, ఈ టైములో హీరో అవ్వడం అవసరమా? అన్నట్టుగా ఫ్రెండ్స్ మాట్లాడతారు. నాకేం తక్కువ.. డైరెక్టర్, ప్రొడ్యూసర్ దొరికితే హీరో అయ్యి చూపిస్తానని సత్య అంటాడు.
అనౌన్స్ మెంట్ వీడియోతో ఆకట్టుకున్న టీం.. తాజాగా టైటిల్ ని రివీల్ చేస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ చిత్రం ‘జెట్లీ’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇక పోస్టర్ లో ఫ్లయిట్ మీద నాన్ షాక్ పట్టుకొని బ్రూస్ లీ లాగా సత్య ఫోజ్ ఇవ్వడం ఫన్నీగా ఉంది.
‘జెట్లీ’ షూటింగ్ త్వరలోనే ప్రారంభం. కమెడియన్ నుండి కామెడీ హీరోగా మారుతున్న సత్య.. ఈ సినిమాతో ఏ స్థాయిలో అలరిస్తాడో చూడాలి.
