
తారాగణం: విక్రాంత్, చాందిని చౌదరి, మురళీధర్ గౌడ్, వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమఠం, జీవన్ కుమార్, శ్రీలక్ష్మి, హర్షవర్ధన్ చేపట్టారు.
సంగీతం: సునీల్ కశ్యప్
డీఓపీ: మహి రెడ్డి పండుగల
ఎడిటర్: సాయి కృష్ణ గణాల
మాటలు: కళ్యాణ్ రాఘవ్
కథ, స్క్రీన్ ప్లే: సంజీవ్ రెడ్డి, షేక్ దావూద్ జి
దర్శకత్వం: సంజీవ్ రెడ్డి
నిర్మాతలు: మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి
బ్యానర్స్: మధుర ఎంటర్‌టైన్‌మెంట్, నిర్వి ఆర్ట్స్
విడుదల తేదీ: నవంబర్ 14, 2025
ఇటీవల ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిన్న సినిమాలలో సంతాన ప్రాప్తిరస్తు ఒకటి. పెళ్ళయ్యి పిల్లలు పుట్టకపోతే ఆ జంట ఎదుర్కొనే ఇబ్బందుల నుండి పుట్టే హాస్యం, భావోద్వేగాలతో దీనిని ప్రదర్శించారు. విక్రాంత్, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఏ మేరకు మెప్పించింది అనేది రివ్యూలో చూద్దాం. (సంతాన ప్రాప్తిరస్తు సమీక్ష)
కథ:
చిన్నతనంలోనే తల్లిదండ్రులను దూరం చేసుకున్న చైతన్య(విక్రాంత్), హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తాడు. అక్క కుటుంబం ఫారెన్ లో సెటిల్ అవుతుంది. దీంతో ఆఫీస్, ఫ్రెండ్సే ప్రపంచంగా బ్రతుకుతున్నాడు. అలాంటి చైతన్య.. గ్రూప్స్ ఎగ్జామ్ కోసం హైదరాబాద్ కి వచ్చిన వరంగల్ అమ్మాయి కళ్యాణి(చాందిని చౌదరి)ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ఆమెతో కలిసి జీవితాన్ని పంచుకోవాలి అనుకుంటాడు. మొదట్లో కళ్యాణి చైతన్యను పట్టించుకోడు. కానీ, అనుకోకుండా జరిగిన ఒక సంఘటన ఇద్దరినీ దగ్గర చేసింది. అలా ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అయితే రిటైర్డ్ టీచర్ అయిన కళ్యాణి తండ్రి ఈశ్వర్ రావు(మురళీధర్ గౌడ్) వారి ప్రేమకు అడ్డు చెబుతాడు. ఇప్పటికే చైతన్యను ఒకసారి కలిసి.. అతని అలవాట్లు, పద్ధతి నచ్చింది.. వారి పెళ్ళికి నిరాకరిస్తాడు. అయితే పెద్దలకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా, పిల్లలు పుడితే వాళ్ళే దగ్గరవుతురన్న నమ్మకంతో.. ఈశ్వర్ రావుకి చెప్పకుండా వెళ్ళిపోయి చైతన్య, కళ్యాణి పెళ్లి చేసుకున్నారు. కూతురిపై అమితమైన ప్రేమ ఉన్న ఈశ్వర్ రావు.. కొద్దిరోజులకే కూతుర్ని వెతుక్కుంటూ వస్తాడు. చైతన్య జీవితంలో ఇక అంతా సాఫీగా జరుగుతుంది అనుకుంటున్న టైంలో ఊహించని షాకులు ఎదురవుతాయి. స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటంతో పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువని డాక్టర్లు చెబుతారు. మరోవైపు, కళ్యాణిని తన నుంచి దూరం చేసి.. రెండో పెళ్లి చేయాలనే లక్ష్యంతో ఈశ్వర్ రావు వచ్చాడని తెలుస్తుంది. ఇవి చైతన్య జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయి? అతని నుండి కళ్యాణి దూరంగా వెళ్లిపోయే పరిస్థితి ఎందుకు వస్తుంది? చివరికి ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
కథగా చూసుకుంటే సంతాన ప్రాప్తిరస్తు పెద్ద కథేమీ కాదు. నిజానికి ఇలాంటి రొమాంటిక్ కామెడీ సినిమాలకు లేదా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కి పెద్ద కథ కూడా అవసరం లేదు. సింపుల్ స్టోరీలను బ్యూటిఫుల్ గా చెప్పగలిగితే చాలు. సన్నివేశాలలో, సంభాషణలలో కొత్తదనం ఉండేలా చూసుకోవాలి. ఎంటర్టైన్ అందిస్తూనే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేసి.. ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా చేయాలి. కానీ, సంతాన ప్రాప్తిరస్తు విషయంలో అలాంటి మ్యాజిక్ జరగలేదు.
స్టోరీ లైన్ బాగానే ఉంది. కామెడీకి, ఎమోషన్ కి మంచి స్కోప్ ఉంది. అందుకు తగ్గట్టే ఈ సినిమాలో ఆ రెండూ ఉన్నాయి. కానీ, కామెడీ థియేటర్‌లో కూర్చున్న ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా లేదు. ఇక ఎమోషన్.. థియేటర్ నుండి బయటకు వచ్చాక గుర్తుంచుకునేలా లేదు. దానికి కారణం రైటింగ్ పొడిపొడిగా ఉండటం.
అసలు కథలోకి వెళ్ళడానికి చాలా సమయం తీసుకున్నారు. ఫస్ట్ హాఫ్ ఎక్కువగా హీరో పాత్ర పరిచయం, ఆఫీస్ సెటప్, హీరోయిన్ తో ప్రేమ సన్నివేశాలతోనే నడిచింది. ఈ ఉంటే వచ్చే కామెడీ అంతగా వర్కౌట్ కాలేదు. ప్రేమ కథలోనూ కొత్తదనం లేదు. ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగానే ఉంది. సెకండాఫ్ లో ఫన్ కి, డ్రామాకి బోలెడంత స్కోప్ ఉందనే ఆశని కలిగించింది. అయితే ఫస్ట్ హాఫ్ తో కాస్త బెటరే కానీ, సెకండాఫ్ కూడా గొప్పగా లేదు. వెన్నెల కిషోర్ ట్రాక్ అంత ఇంతో పరవాలేదు. పతాక సన్నివేశాలు మాత్రం బాగానే ఉన్నాయి. ఆ ఎమోషన్ కి తగ్గట్టుగా క్లైమాక్స్ సంభాషణలు బాగానే కుదిరాయి.
ఒక విషయంలో మాత్రం మూవీ టీంని అభినందించాలి. సంతానం కలగకపోవడం, అందుకే హీరోకి స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం చాలా సున్నితమైన అంశం. దానిని జాగ్రత్తగా డీల్ చేయాలి. ఏ గీత దాటినా.. నిజ జీవితంలో అలాంటి సమస్యను ఎదుర్కొన్న వారిని బాధపెట్టిన వారవుతారు. అలాగే, కొన్ని సీన్స్ హద్దు దాటితే ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఆ విషయంలో మాత్రం.. టీంని మెచ్చుకోవాలి. గీత దాటకుండా బ్యాలెన్స్డ్ గానే సినిమాని నడిపే ప్రయత్నం చేశారు.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
చైతన్య పాత్రలో విక్రాంత్ బాగానే రాణించాడు. భర్త, తండ్రి ప్రేమ మధ్యలో నలిగిపోయే కళ్యాణి పాత్రలో చాందిని తన సహజ నటనతో మెప్పించింది. కూతురు మీద అతి ప్రేమ చూపించే తండ్రి పాత్రలో మురళీధర్ గౌడ్ తన మార్క్ చూపించారు. డాక్టర్ భ్రమరంగా వెన్నెల కిషోర్, హీరో ఫ్రెండ్ గా అభినవ్ గోమఠం, చిన్నపాటి దాదా జాక్ రెడ్డిగా తరుణ్ భాస్కర్ అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు. హర్షవర్ధన్, జీవన్ కుమార్ పాత్రల పరిధి మేరకు నటించారు.
రచయితగా దర్శకుడు సంజీవ్ రెడ్డి పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఆసక్తికరమైన కథనాన్ని, కొత్తదనంతో సన్నివేశాలను రాసుకోలేకపోయారు. సునీల్ కశ్యప్ సంగీతం పరవాలేదు. మహి రెడ్డి పండుగల కెమెరా పనితనం ఆకట్టుకుంది. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది. ఎమోషనల్ సీన్స్ లో డైలాగ్స్ ఓకే కానీ, కామెడీ సీన్స్ లో ఆ పంచ్ లేదు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్ డైలాగ్స్ తో నిండిపోయాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ఫైనల్ గా…
సంతాన ప్రాప్తిరస్తులో.. కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది. కానీ, అది తగిన మోతాదులో లేదు. ఈ సినిమా భాషలోనే చెప్పాలంటే కౌంట్ సరిపోలేదు.
రేటింగ్: 2.25/5
నిరాకరణ: ఈ సమీక్షలో వ్యక్తీకరించబడిన వీక్షణలు సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయాలు మరియు సంస్థ ఎటువంటి బాధ్యత వహించదు. ఈ సమీక్షకు వ్యాఖ్యానించడానికి లేదా ప్రతిస్పందించడానికి ముందు వీక్షకుల విచక్షణతో సలహా ఇవ్వబడుతుంది.

CEO
Mslive 99news
Cell : 9963185599
